పేరు:- "పుట్టినప్పటినుంచి పేరొకలా ఏడిచిందా? చిన్నప్పుడు, గిర్రడని, ఆతర్వాత గిరీశమని, గీరీశంగారని" గురజాడ వారన్నట్లు నాకు ఒక పేరు కాదమ్మాయ్! రెండు పేర్లు. పెద్ద కధే ఉంది మరి, చెప్పమన్నావా? ఒక పేరు కన్నమ్మ పెట్టింది, పెంచుకున్నమ్మ పొద్దుచూసేది, చూడలేక నాకు ’భాస్కరశర్మ’ అని పేరు కన్నమ్మ చేత పెట్టించి, తనుపొద్దు చూడటం మానేసిందిట. అలా మొదటిపేరు కన్నమ్మ పెట్టినా అది పెంచుకున్నమ్మ ఆలోచనే. ఆ తరవాత పద్నాలుగో సంవత్సరం లో పెంచుకున్నమ్మ పుట్టినప్పుడు తను పెట్టించిన పేరు మార్చేసి ’వేంకట దీక్షితులు’ అని మళ్ళీ నామ కరణం చేసింది. రెండు పేర్లూ చెప్పుకుంటాను. అప్పటికే బడిలో పుట్టినప్పటి పేరు రాసేయడం తో ఆ రోజులలో మార్పులు చేసేసావకాశం లేక మొదటి పేరుతో మిగిలిపోయా.
మీ ఊరు:- ప్రస్తుతం తూ.గో.జి లో అనపర్తి. రాజమంద్రికి ముఫ్ఫయి కి.మి. దూరం. చెన్నై-కలకత్తా మెయిన్ లైన్ మీద ఉన్నది,
స్వస్థలం;- నావన్నీ రెండేనమ్మా! పొరపాటు పడకేం ఇల్లాలు మాత్రం ఒకత్తే. :)
పుట్టింది గూటాల, ప.గో.జిలో పోలవరం దగ్గర పల్లెటూరు. పెరిగింది, మరో పల్లెటూరు, తూ.గో.జిలో దుళ్ళ, రాజమంద్రికి పదిహేనుకిలోమీటర్లు దూరం. మొత్తానికి గో.జి.లు నా పుట్టిన ఊళ్ళు.
హాబీస్:- మాకు దొరకనివి పుస్తకాలు. ’పుస్తకం ఉంటే చాలు మీకు తిండీ నీళ్ళూ అక్కరలేదు, మేమున్నామో లేదో కూడా చూడరు, అందులో ములిగిపోతారం’టుంది ఇల్లాలు. ఈ మధ్య కొత్తగా బ్లాగు రాయడం,ఫోటో లు తీయడం.
పుట్టిన రోజు:- కార్తీక బహుళ పాడ్యమి,(నవంబరు నాలుగు) విజయదశమి (అక్టోబర్ ౨౫, నేను రెండు సార్లు పుట్టేను కదా)
అభిమాన రచయిత:- శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ రాచకొండ విశ్వనాధ శాస్త్రి.
నచ్చే రంగు;- తెలుపు, బంగారు వర్ణం.
నచ్చేసినిమా:- సినిమాలు చూసి నలభయి ఏళ్ళయిందేమో! మాయాబజార్,సీతారామ కల్యాణం.
ఇష్టమయిన ఆహారం:- ఇల్లాలు చేసేదేదయినా, పనసపొట్టు కూర, పాటోళీ, మెంతి మజ్జిగ, చల్ల పులుసు.
ఇష్టమయిన పుస్తకం;-శ్రీ రామయణ,భారత, భాగవతాలు. శ్రీ పాదవారి వడ్లగింజలు, అనుభవాలూ-జ్ఞాపకాలూను, రావి శాస్త్రి మొత్తం రచనల సంపుటి చాలా పెద్దది నాలుగు వందలపైచిలుకు పేజీల పుస్తకం తెప్పించుకున్నా.
ఇష్టమయిన ప్రదేశం;- నాకు అమ్మ ఇచ్చిన స్వంత పొలం, అమ్మను చూసినట్లే ఉంటుంది.
జీవితం అంటే:- కష్ట సుఖాల కలనేత.
ఇతరులలో నచ్చేవి:- నిజం మాటాడటం.
సాహిత్యంతో మీ ప్రయాణం:- అసలు మొదలేలేదండీ!
మీరోల్ మోడల్:- శ్రీరాముడు.
తెనుగుభాషకు మీవంతు ప్రయత్నం:- ఒత్తులు పొల్లులు వదిలేయకుండా తప్పులు లేకుండా రాయడం చదవడానికి ప్రయత్నం, భాషని తప్పులు లేకుండా పలకడం :) నేను నిత్య విద్యార్ధిని.
నా బలం, బలహీనతా, మనవరాళ్ళే అయ్యారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.
మనవరాలు శ్రీవిద్య తీసిన తాత గారి ఫోటో
- లాస్య రామకృష్ణ